తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.. వేసవి సెలవుల కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రెండు మూడు రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
ప్రస్తుతం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో నిండిపోవడంతో.. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఉంది. SSD టోకెన్లు లేని భక్తులకు దర్శనం 30 గంటలు పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్‌లోకి రావాలని చెప్పారు. టీటీడీ ప్రకటన తర్వాత భక్తులు పీఏసీలకు వెళ్లిపోయారు.. అలాగే రద్దీ కారణంగా సీఆర్వో ఆఫీస్ దగ్గర భక్తులు క్యూ కట్టారు. కళ్యాణకట్టలో కూడా భక్తుల కనిపిస్తోంది.. భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.. అక్కడ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తుల కోసం.. శ్రీవారి సేవకుల సాయంతో తాగు నీరు, పాలు, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. అలాగే కొండపై రద్దీని గమనించి భక్తులు తిరుమలకు రావాలని సూచనలు చేస్తున్నారు.
తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేసింది. జులై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ రద్దీ పెరగకుండా ఎక్కువమంది భక్తులు దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు.. కానీ గత రెండు మూడు రోజుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.. ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అందుకే టీటీడీ భక్తుల్ని అలర్ట్ చేసింది.. రద్దీని గమనించి తిరుమలకు రావాలని కోరుతోంది. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. రూ..300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుంచి 5 గంటలు పడుతోంది. బుధవారం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. వీరిలో 44,107 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరింది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీతో టీటీడీ అలర్ట్ అయ్యింది.. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తోంది.
Tags: Devotees Must Not Enter Queue Lines: TTD Alert—Here’s Until When!