May 22, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షాలు.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు, పెద్దపల్లిలో 46.5 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షాలు.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు, పెద్దపల్లిలో 46.5 డిగ్రీలు నమోదు

May 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు.
దీంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం పూట అత్యవసరం అయితే తప్ప ప్రజలు కాలు బయటపెట్టడం లేదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదు కాగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెం.., కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీలు.. ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. మరోవైపు.. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు.. మార్కాపురం జిల్లాలోని నందనమారెళ్లలో 46.6 డిగ్రీలు.. పోలవరం జిల్లాలోని కూనవరంలో 46.5 డిగ్రీలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో ఏకంగా ఇవాళ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ భీకరమైన ఎండల తీవ్రత సోమవారం వరకు కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. తెలంగాణలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4 డిగ్రీలు, మహబూబాబాద్‌ జిల్లా కురవిలో 46.3 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 46.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్‌లో 46.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలు దాటి నమోదు కావడం పరిస్థితి అద్దం పడుతోంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో.. ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండి.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. పగటి పూట బయటికి రాకపోవడమే ఉత్తమం అని పేర్కొంటున్నారు.

Tags: Rains of Fire in the Telugu States: 48.1°C Recorded in Piduguralla, 46.5°C in Peddapalli.