May 21, 2026
Explore
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్

పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్

May 21, 2026 | Andhra Pradesh

మదనపల్లిముచ్చట్లు:

నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, జిల్లాలో మూడు రోజుల పాటు ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పెరుగుతున్న పని ఒత్తిడిని అధిగమించేందుకు, సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో మే 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల వరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ఈ తరగతులు జరుగుతాయని వివరించారు. మదనపల్లిలో జిల్లా పోలీసు కార్యాలయం, రాయచోటిలో డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ మైదానం, పీలేరులో సీఐ యుగంధర్ పర్యవేక్షణలో, అలాగే పుంగనూరులో సీఐలు శ్రీ సుబ్బరాయుడు, సాయిప్రసాద్ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం జిల్లా నోడల్ అధికారిగా డీఎస్పీ (ఏఆర్) డి. ఏడుకొండల రెడ్డి ని నియమించినట్లు, అలాగే యోగా మాస్టర్లు డాక్టర్ గోపాల్ మరియు కె. రామాంజనేయులు నేతృత్వంలో శిక్షణ తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు. సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రొటేషన్ పద్ధతిలో 100 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకున్నామని, మెడిటేషన్ వల్ల కలిగే ప్రశాంతత ద్వారా పోలీసు సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు సీఐ లు , ఆర్ఐ లు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పోలీసు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tags: ‘Heartfulness’ Meditation for the Mental Peace of Police Personnel