మదనపల్లిలోని ఎస్పీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లి ముచ్చట్లు:
అహర్నిశలు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారుల, సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సిబ్బందికి అత్యంత కీలకమైన సి.బి.సి (రక్త పరీక్ష), కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు బ్లడ్ షుగర్ మరియు మూత్ర పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు హోంగార్డులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అంజనా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి , ఏఆర్ డిఎస్పీ డి.ఏడుకొండల రెడ్డి , పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత మెడికల్ చెకప్ పరీక్షలు చేయించుకున్నారు.
Tags: District SP Pays Special Attention to Police Health