November 2, 2026
Explore
మురసు తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి…

మురసు తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి…

November 2, 2026 | Andhra Pradesh

తుఫాను ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

మురసు తుఫాను ప్రభావంతో నేడు, రేపు జిల్లాలో వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో…. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో తుఫాను సంసిద్ధత, సహాయక చర్యలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, ఎక్కడైనా భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల వల్ల ఇబ్బందులు తలెత్తితే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, నీటిపారుదల వనరులను నిరంతరం పర్యవేక్షించాలని, చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు తనిఖీలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తుఫాను ప్రభావం, పిడుగుల ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా సూచనలు జారీ చేయాలని తెలిపారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఉరుములు, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగించేందుకు జనరేటర్లు, పవర్ బ్యాకప్ సిద్ధంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు రెస్క్యూ బృందాలు, బోట్లు, లైఫ్ బాయ్‌లు, ఇతర అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలు రహదారులు, కల్వర్టులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సన్నద్ధత ఉంటే ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వాతావరణ పరిస్థితులను తేలికగా తీసుకోకుండా ప్రతి శాఖ తన బాధ్యతలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.

ఎన్నికల శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ

జిల్లాలో మురసు తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను డివిజనల్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు.

శిక్షణకు హాజరుకావాల్సిన సిబ్బంది ఎవరూ గైర్హాజరు కాకుండా చూడాలని, ప్రతి శిక్షణ కేంద్రంలో ప్రాక్టికల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, సంబంధిత ఉద్యోగులు తమ ఓటు నమోదైన మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా మార్గదర్శకాలు అందించాలని సూచించారు.

తుఫాను పరిస్థితులు, ఎన్నికల విధులు రెండూ సమాంతరంగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు సమయపాలన, సమన్వయంతో బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ వెంకటాద్రి, డిఆర్ఓ వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:Remain alert regarding the impact of Cyclone Murasu…