తిరుపతి ముచ్చట్లు:
ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తగ్గిన భక్తి భావాన్ని పునరుద్ధరించి, ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి విస్తృతంగా ప్రచారం చేశారని భీమవరం ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య రాజగోపాలాచార్యులు తెలిపారు.
తిరుపతిలో నిర్వహిస్తున్న అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో గురువారం జరిగిన సాహితీ సదస్సులు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రాజగోపాలాచార్యులు “అన్నమయ్య – తాత్త్వికత” అనే అంశంపై మాట్లాడుతూ, వైరాగ్యం, విరక్తి, కోరికల నియంత్రణ వంటి విలువలను ప్రజలకు బోధిస్తూ ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడిపించేందుకు అన్నమయ్య సంకీర్తనలు రచించారని పేర్కొన్నారు.
వేదాంత సారాన్ని భక్తి రూపంలో సామాన్యులకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అని ఆయన అభివర్ణించారు. నామసంకీర్తన, నామజపం ద్వారా జాతి, కుల, మతాలకు అతీతంగా భగవంతుని చేరుకోవచ్చని తెలిపారు. శ్రీవారిని సంకీర్తనల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో అన్నమయ్య చేసిన కృషి అపారమని కొనియాడారు.
అనంతరం మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఆచార్య రామనాథం నాయుడు “అన్నమయ్య- పురంధర దాస సంకీర్తన సౌరభం ” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామసంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని చెప్పారు. భాష, ప్రాంత భేదాలు లేకుండా భక్తి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ మహనీయుల సందేశాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
తరువాత పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఈశ్వర్ బాబు ”అన్నమయ్య ఆలోచన – ఆవశ్యకత” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య సమాజం కోసం ప్రతి కీర్తనలో సందేశం అందించారన్నారు. సమాజాన్ని బాగు చేయడం, ప్రజల్లో భక్తి చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. శరణాగతి తత్వాన్ని వైరాగ్యాన్ని తెలుసుకోవాలని ప్రబోధించినట్లు తెలియజేశారు. అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు భాషా సందేశం, కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక, సంగీత సందేశం ఇచ్చినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత ఇతర అధికారులు పుర ప్రజలు పాల్గొన్నారు.
Tags: Annamayya’s Sankirtanas – Spiritual Waves of Energy That Reveal the Soul: Acharya Rajagopalacharyulu