May 14, 2026
Explore
శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.

శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.

May 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా టి.టి.డి ఉద్యోగిగా పరిచయం చేసుకుని మోసం.
  • బాధితురాలి నుంచి రూ.65,000/- స్వీకరించి దర్శనం టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిన నిందితుడు.
  • నిందితుడి వద్ద నుంచి రూ.45,000/- నగదు, మొబైల్ ఫోన్, బ్యాంక్ పాస్‌బుక్కులు స్వాధీనం.
  • భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే దర్శనం, వసతి టికెట్లు పొందాలని జిల్లా ఎస్పీ సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ పర్యవేక్షణలో అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని “శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు ఏర్పాటు చేస్తాం” అంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా పల్నాడు జిల్లా, పెద్దకూరపాడు మండలం, లింగంగుంట గ్రామానికి చెందిన బొడపాటి నవీన్ చౌదరి (33) అనే వ్యక్తి సోషల్ మీడియా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తనను టి.టి.డి ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఎంప్లాయీస్ కోటాలో శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించినట్లు తేలింది.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో పనిచేస్తున్న సూర్యకళ అనే మహిళను నమ్మించి, ఈ సంవత్సరం మార్చి నెలలో ఆరుగురికి శ్రీవాణి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి పలు దఫాలుగా UPI ద్వారా రూ.47,000/- మరియు తిరుమలకు వచ్చిన అనంతరం మరో రూ.18,000/- నగదు తీసుకుని మొత్తం రూ.65,000/- స్వీకరించి, ఎటువంటి దర్శనం టికెట్లు ఏర్పాటు చేయకుండా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ప్రత్యేక బృందం పల్నాడు జిల్లాలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుండి రూ.45,000/- నగదు, ఒక Redmi కంపెనీ వైట్ కలర్ మొబైల్ ఫోన్ మరియు రెండు బ్యాంక్ పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌లోని UPI లావాదేవీలను పరిశీలించగా బాధితుల నుంచి నగదు బదిలీ అయిన వివరాలు నిర్ధారణ అయ్యాయి.

అలాగే నిందితుడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా దాదాపు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుడిపై 2021 నుండి 2026 మధ్య గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో నాలుగు చీటింగ్ కేసులు నమోదై విచారణ ఎదుర్కొంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, అతని గత నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్) విధించారు.

ముద్దాయి వివరాలు:

బొడపాటి నవీన్ చౌదరి,
వయస్సు: 33 సంవత్సరాలు,
లింగంగుంట గ్రామం, పెద్దకూరపాడు మండలం, పల్నాడు జిల్లా.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ, “భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని దర్శనం టికెట్లు, వసతి, ప్రత్యేక ప్రవేశం పేరుతో సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దు. శ్రీవారి దర్శనం మరియు వసతి టికెట్లు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ మరియు అనుమతించబడిన కేంద్రాల ద్వారా మాత్రమే పొందాలి. మోసపూరిత ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని” సూచించారు.

Tags: Man arrested for cheating devotees by promising to arrange Srivari Darshan tickets.