గంజాయి, రౌడీ మూకలపై కఠిన చర్యలు..
అవసరమైతే పి.డి. యాక్టు ప్రయోగం : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల వారీగా పోలీసుల ప్రత్యేక నిఘా..
గంజాయి నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించాలని ఆదేశం..
సీసీ కెమెరాలు, ఈ-సాక్ష్య యాప్‌తో నేరాల నియంత్రణ..
మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి..
హత్య, పోక్సో, అత్యాచార కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు..
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పి.డి. యాక్టు ప్రయోగించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ గారు జిల్లాలోని వివిధ కేసుల పురోగతిని సమీక్షిస్తూ పోలీసు అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, వార్డుల స్థాయిలో పోలీసు పర్యటనలు పెంచాలని సూచించిన ఎస్పీ, గతంలో గొడవలకు పాల్పడిన వారు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
జిల్లాలో గంజాయి విక్రయాలు, రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులపై కొత్తగా హిస్టరీ షీట్లు ప్రారంభించాలని సూచించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్న ఎస్పీ, వ్యాపార వర్గాలు, అపార్టుమెంట్ వాసులతో సమన్వయం చేసుకుని ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు.
దర్యాప్తులో పారదర్శకత కోసం ఈ-సాక్ష్య యాప్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగించి బాధితులను త్వరగా గుర్తించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. దత్తత కానిస్టేబుళ్లు, మహిళా సంరక్షణ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. అలాగే మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, డ్రంకన్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హత్య, అత్యాచారం, పోక్సో, ఎస్సీ/ఎస్టీ వేధింపుల కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించిన ఎస్పీ, నిందితులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలు సేకరించాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు సూచించారు. ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్ఏ నివేదికలను త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి , రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ , మదనపల్లి డీఎస్పీ బి. పావని , జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Tags:We will put an end to the antics of anti-social elements!