-జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.*
మదనపల్లి ముచ్చట్లు:
జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లోపాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సమగ్ర శిక్షా , స్కిల్ డెవలప్మెంట్ మరియు అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఈ విద్యా సంవత్సరానికి గాను “బడి పిలుస్తోంది” కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం విద్యార్థుల నమోదు పరంగా జిల్లా ఆరో స్థానంలో ఉన్నదని ,రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. రాయచోటి, పీలేరు, మదనపల్లి, వాయల్పాడు, గాలివీడు, పుంగనూరు తదితర ఆరు మండలాల్లో నమోదు ప్రక్రియ చాలా తక్కువగా ఉందని సంబంధిత మండలాల అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు.
జిల్లాలోని 89 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు ఇంకా మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదో తరగతి ఫలితాల విశ్లేషణలో సైన్స్ మరియు తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు గుర్తించి, వారికి ప్రత్యేక రిమీడియల్ తరగతులు నిర్వహించి అందరూ ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం మొదటి నుంచే సైన్స్ మరియు తెలుగు సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
జి ఎఫ్ ఎల్ ఎన్ (Guaranteed Foundational Literacy and Numeracy) కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక చదువు, లెక్కల సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మార్చిలో నిర్వహించిన ఎండ్‌లైన్ పరీక్షల్లో 898 పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయని, వచ్చే ఏడాదికి కనీసం 75 శాతం పాఠశాలలు ఈ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. మన బడి మన భవిషత్తు పనులను ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు నిర్వహించాలని సూచించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల శాతం పెంచేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన వారి పూర్తి వివరాల నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఐఈఓ రవి, డిఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Tags: Special attention must be paid to educational development in the district.