May 14, 2026
Explore
భర్తపై పోక్సో కేసు.. విడుదల చేయాలంటూ టవర్‌ ఎక్కిన యువతి,

భర్తపై పోక్సో కేసు.. విడుదల చేయాలంటూ టవర్‌ ఎక్కిన యువతి,

May 14, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:

ఒక జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్‌ కేసు తోపాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసిన ఆ వ్యక్తిని కోర్టుకు తరలిస్తుండగా ఆ యువతి సమీపంలో ఉన్న టవర్‌ ఎక్కింది. తన భర్తను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 2025 అక్టోబర్‌లో యువతీ, యువకుడు కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కాగా, తన కుమార్తెను కిడ్నాప్‌ చేసినట్లు యువతి తల్లి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో యువతి మైనర్‌ కావడంతో కిడ్నాప్‌తో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మరోవైపు మే 12న జైలులో ఉన్న ఆ వ్యక్తిని కేసు విచారణ కోసం కోర్టుకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ యువతి, పోలీస్ స్టేషన్‌ వెనుక ఉన్న హై టెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్‌ ఎక్కింది. తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది.

ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ యువతికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో కోర్టు అనుమతితో ఆ వ్యక్తిని అక్కడకు తీసుకువచ్చారు. తన భర్తను చూసిన తర్వాత ఆ యువతి టవర్‌ నుంచి కిందకు దిగింది. ఆ తర్వాత వారిద్దరూ కౌగిలించుకుని భావోద్వేగంలో మునిగిపోయారు.

అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని జైలుకు తరలించారు. టవర్‌ ఎక్కి నిరసన తెలిపిన ఆ యువతికి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌ ఇస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. బాలీవుడ్‌ పాత సినిమా షోలేను తలపించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Tags: POCSO Case Against Husband: Young Woman Climbs Tower Demanding His Release