March 19, 2026
Explore
రెయిన్ అలర్ట్.. అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు..!!

రెయిన్ అలర్ట్.. అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు..!!

March 19, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు బలంగా వీస్తాయని చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులకు పలు కీలక సూచనలు చేసింది.

రాబోయే మూడు గంటల్లో..

రాబోయే మూడు గంటల్లో ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా అమలాపురం, తణుకు, రాజోలు, భీమవరం, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, నంద్యాల పరిసర ప్రాంతాలు, ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏలూరు జిల్లాలో భారీ వర్షం

నూజివీడు ప్రాంతంలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి. ఏలూరు జిల్లా, పరిసర ప్రాంతాల్లో సుమారు 35,000 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. ప్రస్తుతం ఈదురుగాలుల కారణంగా మామిడి పూత రాలిపోతోంది. మామిడి పిందెలు నేలపై పడిపోతున్నాయని, దీనివల్ల పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Tags: Rain Alert: Heavy Rains in AP Due to Low-Pressure Area!