సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ
అనిల్ చంద్ర పునేఠా
వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో, సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఏడాదికి నూతన పాలకవర్గాలు కొలువుదీరేలా చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న అమరావతిలో కీలక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని, ఇది జూన్ 26 నాటికి పూర్తికానుందని అధికారులు తెలిపారు. మరోవైపు, బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13,291 పంచాయతీలకు ఓటర్ల జాబితాలు ప్రచురించినట్టు సమాచారం. ఈ ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తి చేసి, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.
Tags: Preparations for Local Body Elections in AP: Notification in September!