, ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టితో వేగవంతంగా పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ క్షేత్రస్థాయి పర్యటన
పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా అభివృద్ధి, రైతాంగ సంక్షేమం, సాగునీటి వనరుల బలోపేతం లక్ష్యంగా చేపట్టిన పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్, డ్వామా, ఉద్యానవన, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి మంగళవారం పీలేరు నియోజకవర్గంలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
జలధార–జలహారతి పనుల పరిశీలన
పీలేరు మండలం రేగల్లు పంచాయతీ కమ్మపల్లి వద్ద ఉన్న గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన అమ్మ చెరువు బోడిగుట్ట నుంచి వచ్చే ఫీడర్ ఛానల్ ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా దాదాపు ఆరు చెరువులు నిండే అవకాశముందని అధికారులు వివరించారు.
అలాగే బాలంవారిపల్లి పంచాయతీ గుర్రంవారిపల్లె వద్ద కొత్తనకుంట నుంచి సెట్టిగుంటకు వచ్చే ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అగ్రహారం చెరువుకు అభివృద్ధి చర్యలు
అగ్రహారం గ్రామంలో ఉన్న చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువు అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అడవిపల్లి రిజర్వాయర్ పరిశీలన
తదుపరి కె.వి.పల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్‌ను కలెక్టర్ సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
మామిడి, టమాటా తోటల పరిశీలన
పీలేరు మండలం రేగల్లు గ్రామపంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కలెక్టర్ పరిశీలించారు. రైతు శ్రీకాంత్ రెడ్డి సాగు చేస్తున్న 15 ఎకరాల మామిడి తోటను సందర్శించి, పండ్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కవర్లను పరిశీలించారు. దిగుబడి, మార్కెట్ ధరలు, సాగు పరిస్థితులపై రైతుతో మాట్లాడారు. ఇతర రైతులు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా అవగాహన కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు.
అనంతరం రైతు కుమార్ నాయుడు సాగు చేస్తున్న టమాటా తోటను పరిశీలించి, పంట యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగం, దిగుబడి అంశాలపై వివరాలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆధునిక సాగు పద్ధతులు అనుసరించాలి
ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ…, రైతులు ఆధునిక సాగు విధానాలు, సేంద్రీయ ఎరువుల వినియోగం, డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ, పంటల బీమా, ఉద్యాన అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయం పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ విటల్ ప్రసాద్, రిటైర్డ్ ఎస్‌ఈ వెంకటరామయ్య, డ్వామా పీడీ వెంకటరత్నం, ఉద్యానవన శాఖ అధికారి సుభాషిణి, డీపీఓ రాధమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags;Jaladhara Works and Irrigation Sources Undertaken in the District