May 12, 2026
Explore
తప్పిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థి నీ గుర్తించిన తిరుచానూరు పోలీసులు.

తప్పిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థి నీ గుర్తించిన తిరుచానూరు పోలీసులు.

May 12, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • గోవా రాష్ట్రంలోని వాస్కో ప్రాంతంలో బాలుడు సురక్షితంగా గుర్తింపు.
  • విద్యార్థుల మానసిక పరిస్థితులపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ., సూచనలు.
  • పిల్లలు కనిపించకుండా పోయిన ఘటనల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలు మరియు పర్యవేక్షణలో తిరుచానూరు పోలీసులు తప్పిపోయిన బాలుడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి సురక్షితంగా గుర్తించారు.

11-03-2026 తేదీ సాయంత్రం సుమారు 7:00 గంటల సమయంలో గీతం జూనియర్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సి. జస్వంత్ రెడ్డి (17 సంవత్సరాలు), తండ్రి దేవేంద్ర రెడ్డి, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కాలేజ్ నుండి వెళ్లిపోయాడు. ఈ విషయమై 12-03-2026 తేదీన కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సూచనల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, వివిధ ప్రాంతాల సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు అనగా 12-05-2026 తేదీ ఉదయం బాలుడు గోవా రాష్ట్రంలోని వాస్కో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం స్థానిక వాస్కో పోలీస్ స్టేషన్‌లో బాలుడిని హాజరు పరచి విచారించగా, ఫైనల్ పరీక్షలు సరిగా రాయకపోవడం వల్ల భయాందోళనకు గురై ఎవరికీ చెప్పకుండా కాలేజ్ నుండి వెళ్లిపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో లేదా ఉపాధ్యాయులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేదించిన తిరుచానూరు పోలీసులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ అదేవిధంగా పిల్లలు లేదా యువత కనిపించకుండా పోయిన ఘటనల్లో ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Tags:Tiruchanur Police locate missing Intermediate student.