బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ తీవ్రంగా విమర్శించారు.చౌడేపల్లి మండలం, ఎగువ మల్లెవారిపల్లిలో క్రికెట్ ఆడుతూ 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ మాట్లాడుతూ వ్యవస్థల వైఫల్యం: “ఒక యువకుడు ప్రాణాలు కోల్పోతే,ఆ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ గానీ, వాహన సౌకర్యం గానీ లేక స్నేహితులు బైక్‌పై తీసుకువెళ్లడం చూస్తుంటే మనం 2026లో ఉన్నామా? లేక 1970ల నాటి చీకటి రోజుల్లో ఉన్నామా? అనిపిస్తోంది.”అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి సూటి ప్రశ్న: అభివృద్ధి అంటే కేవలం ప్రచారాలేనా? ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎమ్మెల్యే,అధికార పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ప్రధాన డిమాండ్: పుంగనూరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యాయని విమర్శించారు.ఈ ఘటనలో మరణించిన యువకుడి కుటుంబానికి బీసీవై పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హెచ్చరించారు.లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరిబాబు యాదవ్ స్పష్టం చేశారు.

Tags; Transporting a dead body on a bike is a disgrace to civilized society.