తిరుపతి ముచ్చట్లు:
- నేపాల్ దేశస్థుడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం.
- తిరుపతిలో కూలీగా నటిస్తూ పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు.
- లాడ్జి యజమానులు గుర్తింపు పత్రాలు పరిశీలించిన తరువాతే గదులు ఇవ్వాలి.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో తిరుపతి క్రైమ్ విభాగం పోలీసులు నగరంలో వరుసగా జరుగుతున్న మొబైల్ ఫోన్ చోరీ కేసులను ఛేదించి, అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్టు చేశారు.
తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ మరియు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ రోజు 11-05-2026 ఉదయం ఇస్కాన్ ఆలయం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేయబడిన నిందితుడు మహేష్ బహదూర్ జటారా అలియాస్ సంతోష్ తాప అలియాస్ డాబా మహేష్ కుమార్ (29), నేపాల్ దేశంలోని బఝంగ్ జిల్లా, చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయపటగాం గ్రామానికి చెందినవాడు. ఇతడు గతంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉండి జైలు శిక్ష కూడా అనుభవించినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడు తిరుపతిలో కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ, పేర్లు మార్చుకుంటూ సంచరిస్తూ రాత్రి వేళల్లో పెద్ద షాపింగ్ మాల్స్‌ను లక్ష్యంగా చేసుకునేవాడు. గత జనవరి మరియు ఏప్రిల్ నెలల్లో రామానుజ సర్కిల్ సమీపంలోని రిలయన్స్ మార్ట్ గోడ దూకి లోపలికి ప్రవేశించి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు సత్రాల పరిసర ప్రాంతాల్లో కూడా పలు చోరీలకు పాల్పడినట్లు బయటపడింది.
నిందితుడి వద్ద నుండి సుమారు రూ.6,00,000/- విలువైన 08 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో శాంసంగ్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ బ్రాండ్లకు చెందిన మొబైల్ ఫోన్లతో పాటు చోరీకి గురైన బ్యాగులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సి.సి.ఎస్ ఇన్‌స్పెక్టర్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం న్యాయస్థానానికి తరలిస్తున్నారు.
ముఖ్య గమనిక:
తిరుపతిలోని లాడ్జి యజమానులు మరియు అక్కడ పనిచేసే సిబ్బంది గదులు అద్దెకు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా సంబంధిత వ్యక్తుల గుర్తింపు పత్రాలు పరిశీలించి మాత్రమే గదులు కేటాయించాలి. నిబంధనలు పాటించని యెడల సంబంధిత వారిపై పోలీసు శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు.
Tags:Inter-state criminal who stole mobile phones arrested.