తిరుపతి జిల్లాలో అమానుషం
- అండగా నిలిచే వారు లేరా?
- కలెక్టర్ గారూ….మా ప్రాణాలు కాపాడండి!
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి, ఆమెకున్న కొద్దిపాటి ఆస్తిపై కన్నేసి వేధింపులకు గురిచేస్తున్న అమానవీయ ఘటన తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలు తన వైద్య ఖర్చుల కోసం ఆస్తి అమ్ముకుంటే, ఆమెను, ఆస్తి కొన్న వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
కథనం వివరాల్లోకి వెళ్తే
కడూరు మునెమ్మ ప్రస్తుతం బసవయ్య పాలెం తొట్టంబేడు గ్రామంలో తన చిన్న కూతురైన రామాయణం జ్యోతి దగ్గర తలదాచుకుంటుంది. కడూరు మునెమ్మ (84)కు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.చెన్నప్పనాయుడుపేట గ్రామం పెళ్లకూరు మండలం లో సాగు భూమి కలదు.కాగా తన భర్త మరణానంతరం తనకున్న 5 ఎకరాల పొలాన్ని ఐదుగురు కుమార్తెలకు పంచగా, మిగిలిన ఒక ఎకరం తన పోషణ, వైద్య ఖర్చుల కోసం ఉంచుకుంది. నలుగురు కుమార్తెలు ఆమెను గాలికి వదిలేయగా, చిన్న కుమార్తె రామాయణం జ్యోతి మాత్రమే గత 30 ఏళ్లుగా తల్లిని సాకుతోంది.
వైద్య ఖర్చుల కోసం ఆస్తి విక్రయం..అడ్డుకుంటున్న కన్నకూతుళ్లు
నడుము ఆపరేషన్ కోసం మునెమ్మ తన వాటాలోని 34 సెంట్ల భూమిని గతంలోనే అమ్ముకుంది. మిగిలిన 66 సెంట్లను 2013లో తనను సాకుతున్న మనవడు రామాయణం శేఖర్‌కు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చింది. ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆ పొలాన్ని ఏప్రిల్ 2026లో విక్రయించగా, అసలు సమస్య మొదలైంది.
చంపేస్తామంటూ బెదిరింపులు.. కులం పేరుతో బరితెగింపు
మునెమ్మ కుమార్తెలు ఆలం విజయమ్మ, చొక్కాని మల్లీశ్వరితో పాటు మనవడు ఆలం దొరబాబు, స్థానికుడు ఆరూరు సుబ్రహ్మణ్యం కలిసి వృద్ధురాలిని శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. “పొలం అమ్మే హక్కు నీకు లేదు.. పొలంలోకి వస్తే చంపేస్తాం” అంటూ బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారని మునెమ్మ సోమవారం కలెక్టర్‌కు సమర్పించిన అర్జీలో ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆరూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కులం పేరును అడ్డుపెట్టుకుని, చట్టపరంగా తనను ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరికి చెప్పుకున్నా లెక్కలేదంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది.
కలెక్టర్ గారూ.. న్యాయం చేసేనా?
తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం – 2007 ప్రకారం తన ఆస్తిపై తనకు పూర్తి హక్కు ఉందని, దానిని అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మునెమ్మ జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది. తన చివరి దశలో ప్రశాంతంగా, మందులకు ఇబ్బంది లేకుండా బ్రతికేలా పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె విన్నవించింది. వృద్ధురాలి కన్నీటి గాథ విన్న జిల్లా యంత్రాంగం స్పందించి బాధ్యులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకొంటారో వేచి చూడాల్సివుంది.
Tags: Daughters and Grandson Harassing 84-Year-Old Mother