. వెలుగులోకి తెచ్చిన చరిత్రకారుడు రమేష్!
కడప ముచ్చట్లు:
కడప-రాయచోటి రహదారి మధ్య శేషాచల అడవుల్లోని సిద్ధమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో గుంటముల చెరువు దగ్గర పదో శతాబ్దం నాటి అరుదైన విరిగిన స్థితిలో ఉన్న ఒక శిరస్సు, స్త్రీ మూర్తి మొండెం , ఒక శైవ మూర్తి విగ్రహాలను గుర్తించి వెలుగులోకి తెచ్చినట్లు మైదుకూరుకు చెందిన రచయిత,చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం మీడియాకు తెలిపారు.
విగ్రహాల వివరాలు…
శైవ మూర్తి (పాలేటయ్య)… స్థానికులు ‘పాలేటయ్య’ అని పిలిచే ఈ విగ్రహం పూర్తిగా పుట్ట మట్టిలో కలిసిపోయి ఉందన్నారు. విగ్రహం ఎడమ చేతిలో డమరుకం, తలపై కరండ మకుటం ఉన్నాయని, కుడి చేయి కాలక్రమేణా అంతరించిపోయిందని రమేష్ చెప్పారు.
శివ శిరస్సు… ప్రశాంతమైన ధ్యాన ముద్రలో ఉన్న ఒక విగ్రహ శిరస్సు లభించిందని వివరించారు. ఈ తలకు ఎడమవైపున తలక్రిందులుగా ఉన్న త్రిశూలం ఉండటం విశేషమని కళ్లు మూసుకుని ఉన్న ఈ ముఖ కవళికలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు.
స్త్రీ మూర్తి (యోగిని)…
స్థానికులు ‘పాలేటమ్మ’గా పిలిచే ఈ విగ్రహంలో తల భాగం లేదు, కేవలం మొండెం మాత్రమే లభ్యమైందన్నారు. యోగాసనంలో కూర్చుని ఉన్న ఈ మూర్తి, రెండు చేతులను ఉదరంపై ఉంచి యోగ ముద్రలో ఉందని చెప్పారు. చేతులలో ఏముందనేది రాయి అరిగిపోవడం వల్ల స్పష్టంగా తెలియడం లేదని వివరించారు.
*నిపుణుల ధృవీకరణ…
లభ్యమైన శిరస్సు మరియు స్త్రీ మొండెం రెండు వేరువేరు విగ్రహాలకు చెందినవని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ ధృవీకరించారు.
ఇవి పదో శతాబ్దం నాటివని మైసూర్ విశ్రాంత పురావస్తు అధికారి విజయ్ కుమార్, విజయవాడ పురావస్తు అధికారి శివకుమార్ స్పష్టం చేసినట్లు రమేష్ వెల్లడించారు.
ఈ విగ్రహాల గురించి చింతకొమ్మదిన్నే మండలం కొలుములపల్లి పంచాయితీ లింగారెడ్డి పల్లె నివాసి, సిద్ధమల్లేశ్వర ఆలయాభివృద్ధి వ్యవస్థాపకులు చెన్నంరెడ్డి నాగ మల్లారెడ్డి సమాచారం అందించారని, ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని రమేష్ తెలిపారు.
Tags: Rare 10th-century idols discovered in the Seshachalam forests.