అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రేపు (సోమవారం) ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్న సీఎం.. అక్కడ వరుస భేటీలతో బిజీబిజీగా గడపనున్నారు.
రేపు ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై కేంద్ర పెద్దలతో సీఎం సంప్రదింపులు జరపనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణ సాయం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (CII) బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు.
రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు.. మరుసటి రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులు, ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Tags: CM Chandrababu to visit Delhi tomorrow; to meet with Amit Shah.