తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో మే 12 హనుమజ్జయంతి సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కలియుగ వైకుంఠంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి రోజున అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడని భక్తులు విశ్వసిస్తుంటారు.
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి.. కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.
తిరుమల కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. హనుమజ్జయంతి సందర్భంగా ఇక్కడి స్వామివారికి టీటీడీ తరపున అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మే 12 హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పించనున్నారు. జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.
తిరుమలలో హనుమజ్జయంతి రోజు ( మే12) ప్రత్యేక పూజల వివరాలు..
శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమల కాలినడక మార్గంలోని ఏడవ మైలు వద్ద కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహానికి విశేష పూజలు జరగనున్నాయి.
తిరుమల కొండల్లోని అత్యంత పవిత్రమైన జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుడికి జయంతి వేడుకలు కన్నులపండువగా జరుగనున్నాయి.
ఉచిత రవాణా సౌకర్యం….
మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మే 12 వ తేది సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. తిరుమల నుంచి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Tags: Hanuman Jayanti is on May 12th in Tirumala.