బి.కొత్తకోటలో మహిళల ఆందోళన
బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోటలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు మహిళల నుంచి సుమారు రూ.17 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళల కథనం మేరకు.. రాయచోటికి చెందిన ఫరీదా, నస్రీన్‌లు తాము “హెచ్‌గార్డ్ బ్ల్యూడీఎస్” అనే సంస్థను నిర్వహిస్తున్నామని చెప్పి బీసీలకు తక్కువ సమయంలో రుణాలు మంజూరు చేస్తామని ప్రచారం చేశారు. రూ.3 వేల లాగిన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులు చెల్లిస్తే రూ.50 వేల రుణం వస్తుందని నమ్మించారు. అలాగే పదిమంది చొప్పున గ్రూపులు ఏర్పాటు చేస్తే ప్రతి గ్రూపుకు రుణాలు మంజూరు అవుతాయని తెలిపారు.
దీంతో బి.కొత్తకోట పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు గ్రూపులుగా ఏర్పడి డబ్బులు చెల్లించారు. అయితే నెలలు గడిచినా రుణాలు రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో బి.కొత్తకోటలో ఫరీదా, నస్రీన్‌లను మహిళలు నిలదీయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ గోపాలరెడ్డి తెలిపారు.
Tags; Fraud of Rs 17 Lakhs Under the Guise of Loans