తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు తిరుమల శ్రీవారి తరఫున శ్రీవారి సారెను శనివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు. సంప్రదాయబద్ధంగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
టీటీడీ తిరుమల పోటు ఏఈవో గుండ్లూరు మునిరత్నం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్‌కు అందజేశారు.
మే 5న చాటింపుతో ప్రారంభమైన శ్రీ గంగమ్మ జాతర మే 13 వరకు వైభవంగా కొనసాగనుంది. తిరుపతి గ్రామదేవతగా పూజలందుకునే శ్రీ గంగమ్మ తల్లిని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సోదరిగా భావించే ఆనవాయితీ ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది శ్రీవారి ఆలయం నుండి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అర్చకులు, అధికారులు సారెను శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అక్కడ శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య శోభాయాత్రగా శ్రీ గంగమ్మ ఆలయానికి సారెను తీసుకెళ్లి ఆలయ అర్చకులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, జానకీ దేవి, గోవిందరాజస్వామి ఆలయం ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:Grand Presentation of ‘Srivari Sare’ to Sri Tatayyagunta Gangamma