-దళితుల భూమిని ఇతరులకు పట్టా ఇచ్చిన రెవెన్యూశాఖ
- కలెక్టర్‌కు ఫిర్యాదు, కోర్టులో కేసు దాఖలు
-పట్టించుకోని అధికారులు - బోరుమంటున్న బాధితురాలు
పుంగనూరుముచ్చట్లు:
రెవెన్యూ అధికారుల అవినీతి అక్రమాలు రోజురోజుకు భూ యజమానులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన , కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న , ఏసిబి అధికారుల దాడుల్లో చిక్కుకున్న రెవెన్యూ అధికారుల్లో మాత్రం చీమకుట్టినట్లు కూడ లేకుండ అక్రమాలు కొనసాగిస్తుండటం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని రాగానిపల్లెకి చెందిన దళిత మహిళ లక్ష్మమ్మ, చెన్నరాయప్ప పేర్లతో ఉన్న భూమిని ధనికుల పేరుతో రికార్డులు మార్చడంతో బాధితులు శనివారం విలేకరుల ఎదుట బోరుమన్నారు. రాగానిపల్లెలో నివాసం ఉన్న చెన్నరాయప్పకు అదే గ్రామంలో సర్వేనెంబరు: 337/3 , ఖాతానెంబరు: 113లో 2ఎకరాల 45 సెంట్లభూమికి ప్రభుత్వం గతంలో పట్టా మంజూరు చేసి , పాసుపుస్తకం జారీ చేశారు. ఇలా ఉండగా రెవెన్యూ అధికారులు చెన్నరాయప్ప, లక్ష్మమ్మలకు తెలియకుండ చంద్రప్ప, గౌరమ్మ ల పేరుతో 1బి రికార్డులు మార్చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి పిజిఆర్‌ఎస్‌లో ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆమె వీధిన పడింది. ఈ భూమికి సంబంధించి విచారణ చేయాల్సిన అధికారులు నిర్లక్షంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల అక్రమాలు తీవ్రమౌతున్నాయి. దీని కారణంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, చెరువులు , ప్రైవేటు భూములు ఆక్రమణలకు గురౌతోంది. రెవెన్యూ అధికారులు తమకు నచ్చిన వారి పేరుతో రికార్డులు మార్చడమే కారణం అంటు బాధితులు ఆరోపిస్తున్నారు
రెవెన్యూ అక్రమాలు ఇలా …
పట్టణ సమీపంలోని ఎంబిటి రోడ్డులోని చిత్తూరుకు వెళ్లే మార్గంలో వేబ్రిడ్జి వద్ద కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమికి రికార్డులు మార్చి ప్లాట్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. గుడిసెబండ వద్ద క్వారీ యజమానితో రెవెన్యూ అధికారులు కుమ్మకై కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేయించడంతో ఆప్రాంత దళితులు రాస్తారోకో నిర్వహించి అడ్డుకున్నారు. మంగళం కాలనీకి చెందిన జర్నలిస్టు ఇంటి పట్టాను ఇతరులకు రెవెన్యూ అధికారులు మార్చడంతో జర్నలిస్టు 6 రోజుల పాటు కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేశాడు. అలాగే కొత్తయిండ్లులో నరసరాజుకు చెందిన భూమిని 40 ఏళ్ల తరువాత రెవెన్యూ అధికారులు వేరోకరి పేరుతో 1బి మంజూరు చేయడంతో యజమాని ఫిర్యాదు చేయడంతో మదనపల్లె సబ్ కలెక్టర్ విచారణ చేసి , స్థానిక అధికారులను మందలించినట్లు సమాచారం. కృష్ణమూర్తి అనే వ్యక్తి తన భూమి కబ్జా చేశారని జిల్లా కలెక్టర్‌కు 16-02-2026న ఫిర్యాదు చేశారు. కానీ స్థానిక అధికారులు కలెక్టర్ ఉత్తర్వులను ఖాతరు చేయలేదు. అతనికి న్యాయం జరగలేదు. అలాగే మండలంలోని ఏతూరులో రెండు చెరువులు కబ్జా చేసిన రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే మండలంలో సర్వే సబ్ డివిజన్‌కు డబ్బులు చెల్లించి సబ్ డివిజన్ సర్వేలు చేసుకోవాలి. కానీ రెవెన్యూ అధికారులు వ్యాపారులతో కుమ్మకై అర్ధరాత్రి సబ్‌డివిజన్లు ఆన్‌లైన్‌లో చేయడం విమర్శలకు దారితీస్తోంది. సామాన్య ప్రజలకు జరగని పనులు వ్యాపారులకు మాత్రమే జరగడం గమనార్హం. రెవెన్యూ సమస్యలపై బాధితులు రోజు పిజిఆర్‌ఎస్‌లో అర్జీలు ఇచ్చి అలసిపోతున్న కనికరించే వారు కానీ, పరిష్కరించే వారు కానీ లేకపోవడం బాధకరం. ఇలా వెలుగు చూడని అక్రమాలు ఎన్నో….
తహశీల్ధార్ వివరణ….
ఈ విషయమై తహశీల్ధార్ రామును ఫోన్‌లో వివరణ కోరగా ఈ విషయాలపై కలెక్టర్‌కు నివేదికలు పంపుతున్నామన్నారు. అలాగే రెవెన్యూలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భూములు, చెరువులు దురాక్రమణపై తక్షణమే విచారణ చేస్తామని , ఆక్రమణలను అడ్డుకుంటామని తెలిపారు.



Tags; The Epitome of Corruption… Punganur Revenue Officials