May 9, 2026
Explore
ఒమాన్ లో చిక్కుకున్న వాయల్పాడు మహిళ సురక్షితంగా స్వదేశానికి!

ఒమాన్ లో చిక్కుకున్న వాయల్పాడు మహిళ సురక్షితంగా స్వదేశానికి!

May 9, 2026 | Andhra Pradesh

👉ఏపీ ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి, జిల్లా ఎస్పీల ప్రత్యేక చొరవ..

👉బాధితురాలి ప్రయాణ ఖర్చులు స్వయంగా భరించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .

👉ఎంబసీతో నిరంతర సమన్వయంతో క్షేమంగా రప్పించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ..

👉మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ . ఏం. వెంకటాద్రి

మదనపల్లి ముచ్చట్లు:

ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అక్కడ యజమానుల చేతిలో మోసపోయి, నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ షహానాజ్ ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేక చొరవతో ఒక మహిళ బాధను అర్థం చేసుకొని, ఆమెను ఇండియాకు రప్పించడం జరిగింది. శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ఈ వివరాలను వెల్లడించారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఒమాన్ ఉదంతం:
వాయల్పాడుకు చెందిన షహానాజ్, అబూబకర్ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏజెంట్ల ద్వారా ఉపాధి కోసం షహానాజ్ ఒమాన్‌లోని మస్కట్‌కు వెళ్లారు. అక్కడ మొదటి నాలుగు నెలలు బాగానే ఉన్నప్పటికీ, గత రెండు నెలలుగా యజమానులు ఆమెతో అధికంగా పని చేయిస్తూ, కనీసం భోజనం కూడా పెట్టకుండా వేధించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చీకటి గదిలో బంధించి, బయటకు వెళ్లనివ్వకుండా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తన దీనస్థితిని తెలుపుతూ రోదించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభుత్వం మరియు పోలీసుల తక్షణ స్పందన: మహిళ ఆవేదనను చూసి చలించిపోయిన ఏపీ ప్రభుత్వం మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెంటనే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్, వాయల్పాడు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళ్లి ఏజెంట్లను విచారించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం, మరియు ఎస్పీ ప్రతిక్షణం ఇండియన్ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఒమాన్ లో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, అక్కడి అధికారుల సహాయంతో ఆమెను రక్షించి సురక్షితంగా ముంబైకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు.

అండగా నిలిచిన ఉపముఖ్యమంత్రి:
షహానాజ్ ముంబై చేరుకున్న తర్వాత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి ఎంతో ఉదారంగా వ్యవహరించారు. ముంబై నుండి హైదరాబాద్‌కు, అక్కడి నుండి విజయవాడకు, తిరిగి అక్కడినుండి అన్నమయ్య జిల్లా వాయల్పాడులోని తన ఇంటికి చేరుకోవడానికి అవసరమైన పూర్తి ప్రయాణ ఖర్చులను ఉపముఖ్యమంత్రి గారే స్వయంగా భరించి, ఆమెకు రవాణా సౌకర్యం కల్పించారు.

కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు:
విదేశాల్లో దిక్కుతోచని స్థితిలో చీకటి గదిలో బందీగా ఉన్న తనను కాపాడి క్షేమంగా కుటుంబం వద్దకు చేర్చిన ఏపీ ప్రభుత్వానికి, తన ప్రయాణ ఖర్చులు భరించి పెద్దదిక్కుగా అండగా నిలిచిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కి, అలాగే ప్రతిక్షణం ఎంబసీతో మాట్లాడుతూ తనను రక్షించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి మరియు పోలీసు సిబ్బందికి షహానాజ్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలికిరి సీఐ అనిల్ కుమార్, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:Woman from Vayalpadu Stranded in Oman Returns Home Safely!