May 5, 2026
Explore
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం

May 5, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్.
  • ఎర్రచందనం కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాసర్ కె.ఎన్ @ నాసర్ భాయిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్.
  • సుమారు మూడు సంవత్సరాల క్రితం శేషాచల అడవుల్లో దాచిపెట్టిన ఎర్రచందనాన్ని తరలించేందుకు వచ్చిన స్మగ్లర్‌ను వలపన్ని పట్టుకున్న అధికారులు.
  • రూ.1.95 కోట్ల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనం స్వాధీనం.
  • శేషాచలం అడవుల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సాగుతున్న ప్రధాన స్మగ్లింగ్ నెట్‌వర్క్ బట్టబయలు.
  • టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించిన టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బరాయుడు,

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) హెడ్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మార్గదర్శకత్వంలో, ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్ అదనపు ఎస్పీ జె. కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తున్నారు. అదే విధంగా, ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిలుగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో, ఈ రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ బృందం, అటవీ శాఖ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనం సహా మొత్తం 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

అరెస్టు చేసిన వ్యక్తిని గతంలో ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాసర్ కె.ఎన్ @ నాసర్ భాయిగా గుర్తించారు. అతను గత పదేళ్లుగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీల సహాయంతో శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికించి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో స్వాధీనం చేసుకున్న 76 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనం కలిపి మొత్తం విలువ సుమారు రూ.1.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో పాల్గొన్న ఇతర ప్రధాన సూత్రధారులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఈ కేసులో అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను అరెస్టు చేసి, భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు, స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ కపిల్ తీర్థం నందు గల టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

అరెస్టు చేయబడిన ప్రధాన స్మగ్లర్ వివరాలు:
నాసర్ కె.ఎన్ @ నాసర్ భాయి, వయస్సు 55 సంవత్సరాలు, తండ్రి నూరుద్దీన్, ఎన్‌ఎస్ మంసిల్, కేనశేరి స్ట్రీట్, పలక్కాడ్ టౌన్ మరియు జిల్లా, కేరళ రాష్ట్రం.