May 5, 2026
Explore
24 గంటల్లోనే కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు

24 గంటల్లోనే కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు

May 5, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల కోసం ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని హత్య చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.
  • సంఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు.
  • కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు.
  • ఇద్దరు నిందితుల అరెస్టు, వారి వద్ద నుంచి గిల్ట్ నగలు మరియు రూ.14,000 నగదు స్వాధీనం.
  • దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ.
  • ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన.
  • ఇళ్లను అద్దెకు ఇవ్వేముందు అద్దెదారుల పూర్తి వివరాలు, పూర్వాపరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఈ రోజు ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నం. 170/2026 కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో నివసిస్తున్న 62 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు టి. లోకేశ్వరి ఈ నెల 1వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేవకపోవడంతో బంధువులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. మొదట హైబీపీ కారణంగా మరణించి ఉండవచ్చని భావించినప్పటికీ, శరీరంపై గాయాలు కనిపించడం, అదే ఇంటి వద్ద అద్దెకు ఉంటున్న రెడ్డప్ప మరియు మహాలక్ష్మి కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు, క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఏ. శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (ఎల్ & ఓ) కె. రవిమనోహర చారి, ఇన్‌చార్జ్ డీఎస్పీ చంద్రగిరి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం. శ్రీలత గార్లకు తగిన సూచనలు జారీ చేశారు. వారి పర్యవేక్షణలో తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఎస్‌ఐలు, సాంకేతిక బృందాలు సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నిన్న అనగా 04.05.2026 సాయంత్రం సుమారు 6.30 గంటలకు ఎంఎల్‌సీ కళ్యాణమండపం, కాలూరు వద్ద నిందితులు రెడ్డప్ప, మహాలక్ష్మిలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో, ఒంటరిగా నిద్రిస్తున్న లోకేశ్వరిని హత్య చేసి, ఇంట్లోని అల్మారాలో ఉన్న నగదు రూ.50,000 మరియు నగలు అపహరించినట్లు వారు ఒప్పుకున్నారు.

దొంగిలించిన నగలతో పరారైన రెడ్డప్ప వాటిని విక్రయించే ప్రయత్నంలో అవి గిల్ట్ నగలు అని తెలిసింది. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.14,000 నగదు మరియు గిల్ట్ నగలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అపరిచితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వేముందు వారి పూర్తి వివరాలు, పూర్వాపరాలు తప్పనిసరిగా ధృవీకరించాలని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా తమ వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 112 కు సమాచారం అందించాలని కోరారు.

కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఎస్‌ఐ లోకేష్ కుమార్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:Tirupati District Police Solve Case Within Just 24 Hours