March 17, 2026
Explore
అసెంబ్లీలో ‘వందేమాతరం’ రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!

అసెంబ్లీలో ‘వందేమాతరం’ రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!

March 17, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ‘వందేమాతరం’ గేయాలాపన వివాదానికి కేంద్రబిందువైంది. జాతీయ గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు సభను బహిష్కరించడం రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం విధిగా ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సోమవారం ఉభయ సభల ప్రారంభంలో ‘జయ జయహే తెలంగాణ’ గీతం తర్వాత వందేమాతరం ఆలపించారు.

వందేమాతరం ఆలాపన మొదలు కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెందీ మాత్రం సభలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ గేయం పాడుతున్నప్పుడు తన కుర్చీలోనే కూర్చుండిపోయారు. పక్కనే ఉన్న బీజేపీ సభ్యుడు లేచి నిలబడాలని సూచించగా, ఆయన కూడా సభ నుంచి బయటకు వెళ్లడం గమనార్హం. తిరిగి జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపన సమయంలో మజ్లిస్ సభ్యులంతా లోపలికి వచ్చారు.

మజ్లిస్ సభ్యుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తీవ్రంగా స్పందించారు. వందేమాతరం ఆలాపనను బహిష్కరించడం హేయమైన చర్య అని, వారి విధేయత ఎవరి పట్ల ఉందో దేశ ప్రజలు గమనిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. పార్లమెంటులో ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. ఇది భరతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానమని, ఇటువంటి చర్యలు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

Tags: ‘Vande Mataram’ Row in Assembly: MIM Members Stage Boycott—BJP Fumes!