May 4, 2026
Explore
విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ప్రశంసలు

విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ప్రశంసలు

May 4, 2026 | Andhra Pradesh

10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ప్రశంసలు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె ముచ్చట్లు:

10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు.

సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణనే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు.

జిల్లాలో ఈసారి సాధించిన 10వ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు.

ఇంటర్‌మీడియట్‌లో తమ ఆసక్తి, లక్ష్యాలకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అభినందించారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు:

  • ఆర్.డి. వైష్ణవి – 595/600, జెడ్పీ ఉన్నత పాఠశాల, కోటపల్లి బాలికలు (పీలేరు మండలం)
  • జి. ఆది విష్ణు – 592/600, వివేకానంద మునిసిపల్ హైస్కూల్, మదనపల్లె
  • జి. కీర్తన – 591/600, ఏపీ మోడల్ స్కూల్, చిన్నమండెం
  • డి. అఖిల – 591/600, ఏపీ మోడల్ స్కూల్, పెనగలూరు
  • ఎన్. సుష్మా తాజ్ – 590/600, జెడ్పీ ఉన్నత పాఠశాల, మాసాపేట (రాయచోటి మండలం)
  • ⁠బి. భువనేశ్వరి, 590/600, ఏపీ మోడల్ స్కూల్, రామాపురం

జిల్లా యంత్రాంగం తరఫున విజేతలందరికీ కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: Collector Praises Students’ Talent