May 3, 2026
Explore
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!

May 3, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లిలో క్రికెట్ బుకీల గుట్టురట్టు:
రూ. 3.59 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం.. పట్టుబడిన ఐదుగురు..

బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

పరారీలో ఏడుగురు: వారిని కూడా త్వరలో పట్టుకుంటాం: మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి . పావని ..

మదనపల్లె ముచ్చట్లు:

ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ వేదికగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగులు కాస్తున్న ఓ ముఠాను మదనపల్లె పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ‘ఫోర్.. సిక్స్..’ అంటూ సెల్‌ఫోన్లలో మునిగిపోయి జూదం ఆడుతున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, మదనపల్లె డీఎస్పీ బి. పావని పర్యవేక్షణలో జరిగిన ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు.

నిమ్మనపల్లి మండలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోందన్న పక్కా సమాచారంతో రూరల్ సీఐ రవి నాయక్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లి ఎస్ఐ పి .రామకృష్ణ మరియు సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం (మే 2న) సాయంత్రం దాడులు నిర్వహించారు. నిమ్మనపల్లి మండలం, రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలోని పిట్టావాండ్లపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద కొంతమంది యువకులు గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో జరుగుతున్న ‘చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్’ మ్యాచ్‌పై ఆన్‌లైన్ లింక్‌ల ద్వారా, నేరుగా నగదు రూపంలో వీరు బెట్టింగ్ కాస్తున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి ఐదుగురిని పట్టుకున్నారు.

అరెస్టయిన వారు వీరే..
పట్టుబడిన వారిలో నిమ్మనపల్లి టౌన్ దిగువ వీధికి చెందిన మహేంద్ర సింగ్ (33), హిగర్ వినయ్ కృష్ణ సింగ్ (30), నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన కామిశెట్టి రెడ్డి ప్రసాద్ అలియాస్ బాబు (26), దిగువపల్లికి చెందిన గంగాపురం సాయికుమార్ (28), జడు హేమంత్ సింగ్ (26) ఉన్నారు. వీరి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ. 3,59,700 నగదును సీజ్ చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డిఎస్పీ గారు తెలిపారు. నిందితులపై నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్‌లో BNS, ఏపీ గేమింగ్, మరియు ఐటీ చట్టాల కింద (Cr. No. 42/2026) కఠిన కేసులు నమోదు చేశారు.

జూదంతో బతుకులు ఛిద్రం చేసుకోవద్దు.. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యువతను తీవ్రంగా హెచ్చరించారు. “క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ జూదాలకు బానిసలైతే కఠిన చర్యలు తప్పవు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో అప్పుల పాలై, చివరకు కన్నవారిని రోడ్డున పడేయొద్దు. టెక్నాలజీ సాయంతో ఆన్‌లైన్ లావాదేవీలపై మా సైబర్ టీమ్ నిరంతరం నిఘా ఉంచింది. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

మదనపల్లి డిఎస్పీ బి పావని మాట్లాడుతూ.. తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడిక, వారి మొబైల్ వాడకంపై నిఘా ఉంచాలి” అని సూచించారు. బెట్టింగ్‌లు, జూదాల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు నిర్భయంగా డయల్ 100/112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Tags: IPL Betting Gang Arrested!