కదిరి ముచ్చట్లు:
కాదేది కవితకనర్హం అన్నట్టు… కాదేది నేరానికి అనర్హం కాదనే విషాద వాస్తవాన్ని మరోసారి బహిర్గతం చేసింది కదిరి ఘటన. ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతం, సమాజంలో గౌరవం ఇవన్నీ ఉన్నా మనసులో దురాశ పుట్టితే మనిషి ఎంత దిగజారుతాడో ఈ సంఘటన చెబుతోంది. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి చైన్ స్నాచర్‌గా మారడం కేవలం ఆశ్చర్యం కాదు అది సమాజానికి చెంపపెట్టు.సమాజం సిగ్గుపడే చర్య.
కడుపు నిండక నేరం చేసే వారి కథలు విన్నాం. కానీ విలాసాల కోసం, అప్పుల బారిన పడి తేలికగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో మహిళల మెడలోని తాళిబొట్లను చైన్ల ను లాగేయడం ఇది కేవలం దొంగతనం కాదు మానవత్వంపై దాడి.
నేరం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కదిరి పోలీసులు చూపిన చాకచక్యం ప్రశంసనీయం . సీసీ కెమెరాల్ని సూక్ష్మంగా గమనించి, నిందితుడిని గుర్తించి, అతి తక్కువ సమయంలో అరెస్ట్ చేయడం వారి నిబద్ధతకు నిదర్శనం. మాటల్లో కాదు, చేతల్లో పని చూపించారు. “నేరం చేస్తే తప్పించుకోవచ్చు” అనే భ్రమలో ఉన్నవారికి ఇది గట్టి హెచ్చరిక.
కేవలం కేసు ఛేదించడమే కాదు భరోసా కల్పించారు. “మీరు నిద్రపోయినా మేమున్నాం” అని చెప్పకుండానే నిరూపించారు. ఇలాంటి అధికారులు ఉన్నంతవరకు నేరస్తులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చివరకు చట్టం ముందే తలవంచాల్సిందే.
నిజం చెప్పాలంటే… ఈ ఘటనలో నిందితుడి చర్య ఎంత సిగ్గుచేటో, పోలీసుల పనితీరు అంత గర్వించదగ్గది.
ప్రజలకు కూడా ఒక స్పష్టమైన హెచ్చరిక ఈ సంఘటన.
నేరస్తులు , నేర పద్దతులు మారుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు కూడా మారాలి. సీసీ కెమెరాలు ఇక లగ్జరీ కాదు అవసరం అని గుర్తించాలి.
మొత్తానికి
దురాశ మనిషిని దొంగగా మార్చితే,
ధర్మం పోలీసులను రక్షకులుగా నిలబెట్టింది.
శహబాస్ కదిరి పోలీస్.
Tags: Greed led to his downfall; he ended up as a thief. The police’s conduct is praiseworthy.