May 3, 2026
Explore
సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం…

సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం…

May 3, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఇది మా లక్ష్యం, మన లక్ష్యం మరియు మనందరి లక్ష్యం…
  • సామాన్య ప్రజలకు, భక్తులకు రక్షణ కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు…
  • తిరుపతి నగరంలోని ఎస్టీవీ నగర్ మరియు న్యూ ఇందిరా నగర్ ప్రాంతాల్లో వేకువజామున కార్డన్ అండ్ సెర్చ్ (వజ్రపహార్) ఆపరేషన్ నిర్వహణ…
  • పోలీస్, ఎక్సైజ్, ఆర్‌టీఏ, ఈగల్, రెవెన్యూ, ఆర్మ్డ్ రిజర్వ్, డాగ్ స్క్వాడ్ విభాగాల సమన్వయంతో భారీ తనిఖీలు…
  • ప్రాంతంలోని రౌడీషీటర్లు, గంజాయి వినియోగదారుల కదలికలపై ప్రత్యేక నిఘా…
  • గంజాయి వినియోగంపై అనుమానితులకు టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు…
  • పాజిటివ్‌గా గుర్తించిన వారికి కౌన్సెలింగ్, పునరావాసం; పునరావృతమైతే చట్టపరమైన చర్యలు…
  • మాదకద్రవ్యాల సరఫరా మూలాలను గుర్తించి సరఫరాదారులపై కూడా చర్యలు…
  • డయల్ 112, 1972 ద్వారా సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచి తక్షణ చర్యలు…
  • ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసులా బాధ్యతగా వ్యవహరించాలి…

తిరుపతి, మే 03: ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు తెల్లవారుజామున ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టీవీ నగర్ మరియు న్యూ ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఉదయం వేళ భారీ బలగాలతో సమగ్ర తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా నివాస గృహాలు, అద్దె ఇళ్లు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి గత నేర చరిత్రను పరిశీలిస్తున్నారు.

ప్రజలతో నేరుగా మమేకమై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఈ ప్రాంతాల్లో గతంలో నేరాలకు పాల్పడిన రౌడీషీటర్లు, గంజాయి వినియోగదారులు ఉన్న నేపథ్యంలో వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వారి కార్యకలాపాలు నియంత్రణలో ఉంటే కాలనీకి మంచి పేరు వస్తుందని, ఆ బాధ్యత పోలీసులతో పాటు స్థానిక ప్రజలదేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అనుమానితులపై గంజాయి వినియోగ నిర్ధారణ కోసం టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాజిటివ్‌గా గుర్తించిన వారికి ముందుగా కౌన్సెలింగ్, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని, అయినప్పటికీ మళ్లీ అదే కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతేకాకుండా గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు అన్న అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తిరుపతిని అలజడి లేని, ప్రశాంతమైన, సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. గంజాయి, మాదకద్రవ్యాలు, రౌడీయిజం, ఇతర నేర కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం. డయల్ 112 లేదా 1972కు సమాచారం ఇవ్వండి. మీ వివరాలను గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌లో పోలీస్ శాఖతో పాటు ఈగల్, ఎక్సైజ్, రెవెన్యూ, ఆర్‌టీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల భద్రత, ప్రాంత అభివృద్ధి కోసమే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

చివరగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ ప్రాంత భద్రత మీ చేతుల్లో కూడా ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలి. మీ సహకారంతోనే సేఫ్ తిరుపతి సాధ్యం అవుతుంది” అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి (శాంతిభద్రతలు) శ్రీనివాస రావు (సాయుధ దళం) మరియు డీఎస్పీలు సీఈలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: The primary objective of Safe Tirupati…