May 3, 2026
Explore
గుడి చీటీ డబ్బుల వివాదం… దాడి ఘటనపై ఫిర్యాదు..

గుడి చీటీ డబ్బుల వివాదం… దాడి ఘటనపై ఫిర్యాదు..

May 3, 2026 | Andhra Pradesh

సంబెపల్లి ముచ్చట్లు:

సంబెపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామం శ్రీనివాసపురంలో గుడి చీటీ డబ్బుల వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. గ్రామంలో రామాలయం నిర్మాణం కోసం గ్రామస్తులు కలిసి చీటీ వ్యవస్థ ద్వారా డబ్బులు సేకరిస్తున్నారు. అయితే కొందరు సభ్యులు సమయానికి చీటీ డబ్బులు చెల్లించకపోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో డబ్బులు చెల్లించని వారిని గ్రామస్తులు ప్రశ్నించగా మాటామాట పెరిగి గొడవగా మారింది.

ఈ ఘర్షణలో నాగేశ్వర, మల్లయ్యలపై కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. దాడిలో వారు గాయపడి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మొదట రాయచోటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఇది తమ పరిధిలోకి రాదని సంబేపల్లి మండల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు. తరువాత సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దాడి చేసిన వారు మాత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, సంబెపల్లి ఎస్‌ఐ వారిని విచారించి వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమపై దాడి జరిగినప్పటికీ న్యాయం జరగలేదని, కేసు నమోదు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. పోలీసులు మాత్రం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Tags: Temple Chit Fund Dispute… Complaint Filed Over Assault Incident.