May 2, 2026
Explore
క్రమశిక్షణతో, నిబద్దత కలిగి నిజయితీగా విధులు నిర్వర్తించాలి

క్రమశిక్షణతో, నిబద్దత కలిగి నిజయితీగా విధులు నిర్వర్తించాలి

May 2, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి విధినిర్వహణలో పాటించవలసిన విధానాలు, ప్రజలతో ప్రవర్తించవలసిన విధానాలు, వృత్తి పట్ల కనబరచవలసిన నిబద్ధత మొదలగు పలు విషయాల గురించి ఈరోజు ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకు విహెచ్ఎఫ్ సెట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తెలిపారు.

  • జిల్లాలో పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం నిలుపుకోవడం అత్యంత ముఖ్యమని, సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఇతర జిల్లాల్లో పోలీస్ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు లేదా సరైన విధంగా స్పందించనట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిసెప్షన్ సిబ్బంది ఫిర్యాదుదారులకు తక్షణ స్పందన ఇవ్వాలి, వారి ఫిర్యాదులను ఆలస్యం లేకుండా నమోదు చేయాలి.
  • ఎఫ్ఐఆర్ నమోదు వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ కేసులను 60 రోజుల్లో, ఘనమైన కేసులను 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని సూచించారు.
  • రాత్రి గస్తీ, డే బీట్స్ పటిష్టంగా నిర్వహించాలి. రాత్రి 11 గంటల తర్వాత అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై నిఘా పెట్టి, అవసరమైతే కేసులు నమోదు చేయాలి. గస్తీ సిబ్బంది వద్ద టార్చ్ లైట్లు, లాఠీలు తప్పనిసరిగా ఉండాలి. అనుమానితులను ఫింగర్ ప్రింట్ పరికరాలతో చెక్ చేయాలని సూచించారు.
  • డయల్ 112 కాల్స్‌కు అర్బన్ ప్రాంతాల్లో 10 నిమిషాల్లో, రూరల్ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో స్పందించాలి. శక్తి కాల్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలి.
  • హైవే పట్రోలింగ్ సిబ్బంది ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన ఇవ్వాలి, బాధితులను సమీప ఆస్పత్రికి తరలించాలి. హైవే సిబ్బందిపై డబ్బుల ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలు/వార్డులకు అడాప్టర్ అధికారులను నియమించి, వారంలో కనీసం రెండు రోజులు పర్యటించి సమాచారం సేకరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి చర్యలు కొనసాగించాలని తెలిపారు.
  • ఓపెన్ డ్రింకింగ్ జరిగే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి, అవసరమైతే కేసులు నమోదు చేయాలి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, శక్తి యాప్‌పై అవగాహన కల్పించాలి.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, బ్లాక్ స్పాట్లను గుర్తించడం, హెల్మెట్ వినియోగంపై కట్టుదిట్టమైన అమలు చేయాలని ఆదేశించారు.
  • సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించి, గ్రామాలు, వార్డులు, దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
  • పీజీఆర్ఎస్ పిటిషన్లను సమర్థవంతంగా పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలి. ఈ-సాక్ష్య యాప్, CCTNS, CCTV360 వంటి సాంకేతిక వేదికలను సమర్థవంతంగా వినియోగించాలి.
  • జిల్లాలో గ్యాంబ్లింగ్, ఇతర అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.
  • పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తూ, ప్రతి వారం గ్రీవెన్స్ డే నిర్వహించాలని, పోలీస్ కుటుంబాలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు.
  • పై ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బందితో కలిసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Tags: One must perform their duties with discipline, commitment, and honesty.