March 17, 2026
Explore
రూల్స్ అందరికీ ఒకటే… విజయ్ ‘జన నాయగన్’ చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

రూల్స్ అందరికీ ఒకటే… విజయ్ ‘జన నాయగన్’ చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

March 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సెన్సార్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ అని, దాని నిర్ణయాల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి అనవసరంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని లాగడం సరికాదని హితవు పలికారు.

ఈ విషయంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన సొంత సినిమా ‘ఓజీ’ అనుభవాన్ని ఉదాహరణగా చెప్పారు. ‘‘నేను ఎన్డీయేలో భాగస్వామిని కాబట్టి ‘ఓజీ’కి యూ/ఏ సర్టిఫికెట్ వస్తుందని మా దర్శకనిర్మాతలు భావించారు. కానీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. దానిని నేను స్వాగతించాను. చిత్రంలో అంత హింస పెట్టుకుని యూ/ఏ ఎలా ఆశిస్తారని మా టీమ్‌నే ప్రశ్నించాను’’ అని పవన్ వివరించారు. ‘జన నాయగన్’ చిత్ర బృందం సెన్సార్ బోర్డు వద్ద సమస్యను సరిగ్గా పరిష్కరించుకోలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడంతో, సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ మార్చి 17న (మంగళవారం) ఈ సినిమాను వీక్షించనుంది. కమిటీ నివేదిక తర్వాతే సినిమా విడుదలపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ వ్యవహారాల్లో రాజకీయాలు ఉండవని చెప్పేందుకు పవన్ తన సినిమానే ఉదాహరణగా చూపించడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags: The Rules Are the Same for Everyone… Pawan Kalyan’s Comments on Vijay’s Film ‘Jana Nayagan’