May 1, 2026
Explore
యుద్ధ ప్రాతిపదికన జలధార పనులను పూర్తి చేయాలి

యుద్ధ ప్రాతిపదికన జలధార పనులను పూర్తి చేయాలి

May 1, 2026 | Andhra Pradesh

సమగ్ర ప్రణాళికతో రైతులకు రెట్టింపు లాభం లక్ష్యం

చెరువుల నింపుదలతో సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం

మదనపల్లి ముచ్చట్లు:

జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 4,938 పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత అధికారులు బాధ్యతతో కృషి చేయాలని ఆదేశించారు.

శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఫీల్డ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమీక్షతో పోలిస్తే ప్రస్తుత వారంలో సాధించిన పురోగతిని పరిశీలించి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

జలధార యాప్ వినియోగంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, మండల వారీగా గుర్తించిన, మంజూరైన, ప్రారంభించిన మరియు ప్రారంభించాల్సిన పనుల వివరాలను మిషన్ మోడ్‌లో తక్షణమే ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మండల వారీగా కాస్కేడ్స్ నింపేందుకు చేపట్టిన చర్యలు, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, పనులు పూర్తయ్యాక నీటి లభ్యతపై సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
జలధార పనుల ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ పెరుగుతుందని, దీనిని ఉపయోగించుకొని ఆర్‌ఎస్‌కే వారీగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రైతులకు పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాన్సూన్ అనంతరం పాల ఉత్పత్తి పెంపునకు పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని, శాఖల సమన్వయంతో రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 3,700 చెరువులు, 332 ఆర్‌ఎస్‌కే కేంద్రాల ఆధారంగా సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువుల పరిధిలోని బోర్లు, రీఛార్జ్ పరిస్థితి, అదనంగా సాగు చేయగల విస్తీర్ణం, పంటల ఎంపిక వంటి అంశాలపై సూక్ష్మస్థాయి కార్యాచరణ రూపొందించి రైతులకు వివరించాలని సూచించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు.

అలాగే ప్రతి చెరువు పరిధిలో కనీసం 20 మంది పాడి రైతులను ప్రోత్సహించి, క్రాస్‌బ్రీడ్ ఆవులు, ఎద్దులు పెంపుతో పాల ఉత్పత్తి పెంచాలని సూచించారు. అదనంగా సుమారు 10,000 పశువులు పెంచితే రోజుకు లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని, రైతులకు రోజుకు సుమారు ₹60 లక్షల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అటవీ శాఖ పరిధిలో చేపట్టాల్సిన జలధార పనులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, సంబంధిత అధికారులతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. జలధార పనులకు సహకరిస్తున్న దాతలను మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించి గౌరవించాలని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో వారిని సన్మానిస్తామని తెలిపారు.

అనంతరం నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరాలు సమర్పించగా, వాటిపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవోలు, డ్వామా పీడీ, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags; The Jaladhara works must be completed on a war footing.