హైకోర్టులో అనుచిత ప్రవర్తన:
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) జి. శ్రీరాములుపై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టు హాల్లో గౌరవ న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, గర్వంగా ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి (HoFF) డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెన్షన్‌కు దారితీసిన ప్రధాన కారణాలు:
- కోర్టులో అనుచిత ప్రవర్తన: మార్చి 3, 2026న హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణా రాహిత్యంతో, అహంకారపూరితంగా వ్యవహరించడం.
- అసంపూర్ణ పత్రాల సమర్పణ: కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కీలకమైన ఉమ్మడి సర్వే నివేదికలోని 3 నుండి 18 పేజీలను జత చేయకపోవడం, దీనివల్ల శాఖకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం.
- తప్పుదోవ పట్టించే సమాచారం: ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చి, శాఖ విశ్వసనీయతను దెబ్బతీయడం.
ఉత్తర్వుల ముఖ్యాంశాలు:
చిత్తూరు జిల్లా అటవీ అధికారి (DFO), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలంలో శ్రీరాములు పుంగనూరులోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సగం జీతంతో కూడిన భత్యం (Subsistence Allowance) చెల్లించనున్నారు.
పుంగనూరు FROగా పూర్తి అదనపు బాధ్యతలను (FAC) వెంటనే మరొకరికి అప్పగించాలని అనంతపురం కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్స్‌కు ఆదేశాలు అందాయి.
Tags:Punganur Forest Range Officer Sriramulu Suspended