– అభినందించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) ఇన్‌స్పెక్టర్‌గా విశేష సేవలు అందిస్తున్న ఎస్.లక్ష్మణమూర్తి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ‘పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ’ నూతన భవనంలో ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన లక్ష్మణమూర్తి ని ఐజీ, ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు.
లక్ష్మణమూర్తి 1995 బ్యాచ్ ఎస్సైగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, మూడు దశాబ్దాల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు:
ఎస్సైగా: విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, సాలూరు టౌన్; ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్నవరం; విశాఖ సిటీలో వన్ టౌన్, టూ టౌన్, పీఎంపాలెం మరియు గాజువాక పోలీస్ స్టేషన్లలో పనిచేశారు.
సీఐగా: అరకు సర్కిల్, వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్, భీమిలి, ఎస్.కోట, విశాఖపట్నం రైల్వే, కొత్తకోట మరియు ప్రస్తుతం అనకాపల్లి డీసీఆర్బీ విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
ఐజీ, ఎస్పీ మాట్లాడుతూ, “లక్ష్మణమూర్తి తన సుదీర్ఘ సర్వీసులో ఉమ్మడి విశాఖ, విశాఖ సిటీ, విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో అంకితభావంతో పనిచేశారు. ముఖ్యంగా డీసీఆర్బీ విభాగంలో జిల్లా క్రైమ్ రికార్డ్స్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం” అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని లక్ష్మణమూర్తి కి శుభాకాంక్షలు తెలియజేశారు. తన పదోన్నతి పట్ల లక్ష్మణమూర్తి సంతోషం వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:DCRB CI S. Lakshmana Murthy Promoted to DSP