తిరుపతి ముచ్చట్లు:
చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతి వారు వేర్వేరు తిరుచ్చిలపై ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు.
అక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకరణ, సేవాకాలం, సాత్తుమొర చేపట్టారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు పొన్నకాల్వ మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు సన్నిధి వీధిగుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందుకు చేరుకునే సమయంలో అక్కడ మహద్వారం యొక్క ఒక తలుపును మూస్తారు (శ్రీ పద్మావతి అమ్మవారు తన బావగారైన శ్రీ గోవిందరాజస్వామివారిని మూసిన తలుపుచాటు నుంచి చూస్తుంది అని ఐతిహ్యం). తరువాత తిరుచానూరు నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: Sri Govindaraja Swamy's Ponnakalva Festival Celebrated Grandly