May 1, 2026
Explore
ఆటపాటలతో ఆర్థిక పాఠాలు

ఆటపాటలతో ఆర్థిక పాఠాలు

May 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, ఇళ్లల్లో పిల్లల సందడి కనిపిస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నాట్యం, సంగీతం, పెయింటింగ్‌ లేదా కోడింగ్‌లాంటి వేసవి శిబిరాలకు పంపిస్తుంటారు. కానీ, వేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన నైపుణ్యాల్లో ఆర్థిక అక్షరాస్యత అత్యంత కీలకమైనదిగా మారుతోంది. రేపటి తరం ఆర్థికంగా స్థిరపడాలన్నా, మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకోవాలన్నా.. చిన్నతనం నుంచే డబ్బు విలువపై వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆర్థిక, మనస్తత్వ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. ఏడెనిమిదేళ్ల నాటికే పిల్లల్లో డబ్బుపై ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ వయసులో పడే బీజాలే.. వారు పెద్దయ్యాక తీసుకునే ఆర్థిక నిర్ణయాలను శాసిస్తాయి. అందుకే, ఈ వేసవి విరామాన్ని పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్‌ నేర్పించే సువర్ణావకాశంగా మలచుకోవాలి. ఇందుకోసం ఇలా చేయండి..

అవసరం-కోరిక
ప్రకటనలు చూసో, స్నేహితుల దగ్గర ఉన్నాయనో పిల్లలు కొత్త వస్తువుల కోసం మారాం చేయడం సహజం. ఆ సమయంలో వారికి అవసరం- కోరిక మధ్య ఉన్న తేడాను సున్నితంగా వివరించాలి. బడికి వెళ్లడానికి బూట్లు కొనడం అవసరం.. కానీ కేవలం ఉండాలి కాబట్టి, బ్రాండెడ్‌ బూట్లే కావాలనడం కోరిక అని వారు గ్రహించేలా చెప్పాలి. సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు బడ్జెట్‌ పరిమితులను వివరిస్తూ వస్తువులను ఎంచుకోవడం చూపిస్తే.. వారిలో విచక్షణతో ఖర్చు చేసే జ్ఞానం అలవడుతుంది.

పొదుపు..ఓ సంప్రదాయం

పాతకాలపు మట్టి హుండీలు లేదా కిడ్డీ బ్యాంకులు డబ్బు దాచుకునే అలవాటుకు అత్యుత్తమ సాధనాలు. వారికిచ్చే పాకెట్‌ మనీ నుంచి కొంత మొత్తాన్ని పక్కనపెట్టడం నేర్పించాలి. ఏదైనా ఖరీదైన బొమ్మ కావాలని అడిగితే వెంటనే కొనివ్వకుండా.. ‘సగం డబ్బు నీ కిడ్డీ బ్యాంకు నుంచి తీద్దాం.. మిగతా సగం నేను ఇస్తాను’ అని చెప్పండి. దీనివల్ల నిరీక్షణలోని గొప్పదనంతో పాటు, వస్తువు విలువ కూడా వారికి బోధపడుతుంది.

డిజిటల్‌ యుగంలో.. బ్యాంకింగ్‌ పాఠాలు
నేటి తరం పుట్టుకతోనే టెక్నాలజీకి అలవాటు పడుతోంది. ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌లతో చేసే చెల్లింపులను వారు గమనిస్తూనే ఉంటారు. అయితే ఫోన్‌లోకి డబ్బు ఎలా వస్తుంది? ఎక్కడ దాచుకోవచ్చు? అనే విషయాలను విడమర్చి చెప్పాలి. కనీసం ఒక్కసారైనా బ్యాంకుకు తీసుకెళ్లి డబ్బులు డిపాజిట్‌ చేయడం, ఏటీఎం నుంచి డ్రా చేయడం, పాస్‌బుక్‌ ట్రీలు చూపించాలి. మైనర్ల కోసం బ్యాంకులు అందిస్తున్న ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతాలు తెరిపిస్తే.. వారిలో బాధ్యత పెరుగుతుంది.

పెట్టుబడి.. చక్రవడ్డీ పాఠం
డబ్బును పొదుపు చేయడంతో పాటే.. దాన్ని వృద్ధి చేయడమూ నేర్పించాలి. స్టాక్‌ మార్కెట్, మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి వారి వయసుకు తగ్గట్లుగా ఉదాహరణలతో వివరించాలి. వారు ఇష్టంగా తినే చాక్లెట్లు, వాడే వస్తువులను తయారు చేసే కంపెనీల పేర్లను చెబుతూ.. వాటిలో పెట్టుబడి పెడితే లాభాలు ఎలా వస్తాయో ఆసక్తికరంగా చెప్పాలి. ముఖ్యంగా చక్రవడ్డీ (కాంపౌండింగ్‌) లోని మహిమను వివరిస్తే.. చిన్న వయసులోనే పెట్టుబడుల పట్ల ఆకర్షితులవుతారు.

శ్రమ లేనిదే.. ప్రతిఫలం లేదు
డబ్బులు ఊరికే రావు అని పిల్లలకు స్పష్టం చేయడం అత్యవసరం. ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సాయం చేసినప్పుడు వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ఆ పని చేస్తే ఇస్తాం అని చెప్పకూడదు. చేసిన తర్వాత ఇవ్వడం మంచి అలవాటు. శ్రమకు, సంపాదనకు మధ్య ఉన్న బంధాన్ని ఈ ప్రక్రియ వారిలో బలంగా నాటుతుంది.

తల్లిదండ్రులదే కీలకపాత్ర

చాలామంది తల్లిదండ్రులు తమ ఆర్థిక ఇబ్బందులను పిల్లల ముందు ప్రస్తావించేందుకు సంకోచిస్తుంటారు. కానీ కుటుంబ బడ్జెట్‌ రూపకల్పనలో పిల్లలను సైతం భాగస్వాములను చేస్తే.. వారిలో బాధ్యతాయుత ప్రవర్తన అలవడుతుంది. ఈ వేసవిలో కోడింగ్‌ క్లాసులతో పాటు, ఇలాంటి ఆచరణాత్మక ఆర్థిక పాఠాలు నేర్పించడం వల్ల వారు భవిష్యత్తులో అప్పుల ఊబిలో పడకుండా, ఆర్థిక స్వతంత్రులుగా మారే అవకాశం ఉంటుంది.

ఇలా చేయొచ్చు..
ఆటల ద్వారా: మోనోపోలీ, బిజినెస్‌ లాంటి బోర్డ్‌ గేమ్స్‌ ఆడించడం వల్ల ఆటపాటల్లోనే వ్యాపార నైపుణ్యాలను నేర్పొచ్చు.
లక్ష్య నిర్దేశం: స్వల్పకాలిక (కొత్త బొమ్మ కోసం), దీర్ఘకాలిక (సైకిల్‌ కోసం) పొదుపు లక్ష్యాలను పిల్లలే నిర్ణయించుకునేలా ప్రోత్సహించాలి.
మీరే ఆదర్శం: పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. కాబట్టి పారదర్శకత పాటిస్తూ, ఖర్చుల విషయంలో మీరే వారికి ఆదర్శంగా నిలవాలి.

ఈ రోజు మీరు మీ పిల్లలకు ఇచ్చే రూ.100 రూపాయల కంటే.. ఆ మొత్తాన్ని ఎలా పొదుపు చేయాలి? ఎంత మేరకు ఖర్చు చేయాలి అని నేర్పే పాఠమే.. వారి జీవితానికి మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి!.

Tags: Financial Lessons Through Games and Songs