– రెవెన్యూ శాఖలో హైటెన్షన్
లంచావతారాల గుండెల్లో రైళ్లు – కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
వీఆర్వో అరెస్ట్ ఎఫెక్ట్ – బెంబేలెత్తిపోతున్న రెవెన్యూ సిబ్బంది
తాడిపత్రి ముచ్చట్లు:
తాడిపత్రి రెవెన్యూ చరిత్రలో మొదటిసారి ఏసీబీ దాడులు జరగడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఏసీబీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఆలూరు గ్రామ వీఆర్వో రామకృష్ణ రైతు ప్రభాకర్ రెడ్డి వద్ద రూ.30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ బృందం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం, మండలంలోని వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వీఆర్వో రామకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతని ఇల్లు, కార్యాలయంతో పాటు పలుచోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఇతర లంచాల వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. మరికొందరు అధికారుల ప్రమేయంపైనా విచారణ జరుగుతోంది.
తాడిపత్రి రెవెన్యూ చరిత్రలో ఇంతవరకు ఏసీబీ దాడులు జరగలేదు. తొలిసారి ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో లంచావతారాలకు చెమటలు పడుతున్నాయి. “తదుపరి ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో” అని సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. కార్యాలయాల్లో ఫైళ్లు సర్దే పనిలో పడ్డారు.
ఏసీబీ దాడులపై ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి పనికీ లంచం అడిగి వేధించేవారు. ఇకనైనా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరుగుతుంది” అని స్థానికులు అంటున్నారు. లంచాలు అడిగితే 14400కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.
Tags: ACB Raids for the First Time in Tadipatri’s History