April 29, 2026
Explore
వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

April 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఘనంగా ప్రారంభమైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ మురళి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – ద్విపద భాగవతం” అనే అంశంపై ప్రసంగించారు. బమ్మెర పోతన శైలిని అనుసరిస్తూనే స్వతంత్ర భావాలతో వెంగమాంబ శ్రీభాగవతాన్ని ద్విపద కావ్యరూపంలో రచించారని తెలిపారు. ఇందులో శ్రీకృష్ణుడి దివ్యరూపాన్ని అత్యంత సుందరంగా చిత్రించారని వివరించారు. అలాగే శతకాలు, యక్షగానాలు, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి గ్రంథాల ద్వారా భక్తి సాహిత్యానికి విశిష్టమైన సేవలందించారని కొనియాడారు.

నగరి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. వరలక్ష్మీ “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అంశంపై మాట్లాడుతూ, సంస్కృతంలో విస్తృతంగా ఉన్న పురాణ విషయాలను వెంగమాంబ సులభమైన భాషలో ఆరు ఆశ్వాసాలలో సమగ్రంగా అందించారని తెలిపారు. ముఖ్యంగా శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని భక్తులకు సులభంగా అర్థమయ్యేలా అందించారని పేర్కొన్నారు.

టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డా. నరసింహాచార్యులు “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సాహిత్య సంవీక్షణం” అంశంపై మాట్లాడుతూ, తెలుగు భక్తి సాహిత్యంలో వెంగమాంబకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఆమె రచనల్లో శ్రీవేంకటేశ్వర స్వామిపై అచంచల భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి, తాత్విక దృక్పథం సమన్వయంగా ప్రతిఫలిస్తాయని వివరించారు. “ద్విపద భాగవతం”లో శ్రీకృష్ణ లీలలను ప్రత్యేకంగా ఆవిష్కరించారని, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి కృతుల ద్వారా తిరుమల క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేసినట్లు తెలిపారు.సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే సంగీత సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Women’s Advancement through Vengamamba’s Writings