సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలే: డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ .
👉రౌడీషీటర్లపై ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి..
👉పోలీసు అధికారులకు కర్నూల్ రేంజ్ డీఐజీ దిశానిర్దేశం..
👉అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పర్యటన, సమీక్షా సమావేశం..
మదనపల్లె ముచ్చట్లు:
జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారి పట్ల ఎంతటి కఠినంగానైనా వ్యవహరించాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని (ఎస్పీ ఆఫీస్) సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తో కలిసి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఐజీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహిళల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రతి అధికారీ తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. అదేవిధంగా, జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు. ఇక పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల స్పందిస్తూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్‌లను గుర్తించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని, అలాగే ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి , మదనపల్లె డీఎస్పీ బి. పావని తో పాటు పలువురు సీఐలు, పాల్గొన్నారు.
Tags: Top Priority for Women’s Safety