తిరుమల ముచ్చట్లు:
భూలోక వైకుంఠాన్ని తలపించిన దశావతార – అష్టలక్ష్మి మండపం
ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణలు
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార – అష్టలక్ష్మి మండపంలో శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అర టన్ను పండ్లు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 100 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం, గజ వాహనంపై విష్ణుమూర్తి, గజ లక్ష్మి, తామరపువ్వుపై విష్ణుమూర్తి, గోపాల కృష్ణుడు, అష్ట లక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మొదటిరోజు వైశిష్ట్యం :
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.
ఈ క్రతువుల అనంతరం వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.










Tags: Sri Padmavathi Parinayotsavams Begin Grandly in Tirumala