నష్టపరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి
రామసముద్రం ముచ్చట్లు:
తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎండిపోయిన పంటలకు వెంటనే పరిహారం ప్రకటించాలని అన్నమయ్య జిల్లా రైతు సంఘం నాయకుడు బి. వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు కే. రామమూర్తి డిమాండ్ చేశారు.రామసముద్రం మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ గుంతయంబాడి గ్రామంలో వర్షాభావం కారణంగా ఎండిపోతున్న వేరుశనగ పంటలు పరిశీలించారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి, రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, రైతులకు సకాలంలో విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాలు అందుబాటులో లేకపోవడం వల్ల అదనపు నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Tags: Groundnut crops are withering due to a lack of rain.