- ఈనెల 6న ధర్నా చేసిన ప్రజలు
- 20 రోజులుగా దుమ్ములోనే జీవనం
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయకపోవడంతో వస్తున్న దుమ్ముతో ఆనారోగ్యంపాలౌతున్నామని, ఆహార పదార్థాల్లో దుమ్ము నిండిపోతోందని పట్టణ ప్రజలు ఈనెల 6న ధర్నా చేశారు. సుమారు 20 రోజులు కావస్తున్న అధికారులు పట్టించుకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. బెంగళూరు రోడ్డును మరమ్మతుల పేరుతో గత మూడు నెలల క్రితం జెసిబిలతో పెరికివేశారు. కత్తార్లపల్లె క్రాస్ నుంచి అరవపల్లె వరకు ప్యాచ్ వర్క్ చేసి ఆపివేశారు. ఆనాటి నుంచి నేటి వరకు పనులు పూర్తి చేయక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వదిలివేశారు. రోడ్డుపై రెండు ప్రక్కల మట్టిదిబ్బలు తోలడంతో వాహనాలు సైతం ఇరుకైన రోడ్డులో ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలతో దుమ్మురేగి ఇండ్లపై దుమ్ము నిండిపోతోంది. అధికారులు , కాంట్రాక్టర్ నిర్లక్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తిరిగి జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు జనం సిద్ధమౌతున్నారు. ఇకనైన జిల్లా కలెక్టర్ ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బి డీఈఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఉప్పరపల్లె రోడ్డు పనులు జరుగుతోందని, యుద్ధం కారణంగా తారు రావడం లేదని, 15 రోజుల్లో పనులు చేస్తామని తెలిపారు.
నిర్లక్ష్యానికి నిదర్శనం….
పుంగనూరు- బెంగళూరు రహదారి మరమ్మతులు చేయకుండ వదిలివేయడం అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. మూడు నెలలుగా పట్టణ ప్రజలు ఇండ్లలో దుమ్ము చేరి ఆనారోగ్యం పాలౌతున్నారు. ప్రజలు సంతోషంగా తిండికూడ తినలేకపోతున్నారు. భరించలేక జనం ధర్నాలు చేసిన అధికారులు స్పందించకపోవడం బాధకరం. తక్షణమే పనులు చేయాలి. లేదా ఆందోళన చేపడుతాం.

- అలీమ్‌బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్, పుంగనూరు.
దుమ్ము భరించలేం…..
పుంగమ్మ చెరువుకట్టపై ఉన్న బెంగళూరు రహదారి పనులు మూడు నెలలుగా గాలికి వదిలేశారు. పనులు చేయలేని వారు రోడ్డును ఎందుకు జెసిబిలతో పెరికేశారు. వెంటనే పనులు పూర్తి చేయండి. వాహనాల రాకపోకలతో దుమ్ము రేగి భరించలేకపోతున్నాం. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆందోళన చేపడుతాం.

- ఆవుల అమరేంద్ర, కట్టక్రిందపాళెం, పుంగనూరు.




Tags: Officials remain indifferent even as people take to the streets.