మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె బసినికొండలో హౌసింగ్ శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిర్మిత కేంద్రం ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. స్థానికులు ఆ స్థలాన్ని యదేచ్ఛగా కబ్జా చేసి అక్రమంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని సమాచారం.
బసినికొండ సచివాలయానికి ఆనుకుని ఉన్న ఈ నిర్మిత కేంద్రం ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించబడినప్పటికీ, కొందరు కబ్జాదారులు దానిని స్వాధీనం చేసుకుంటూ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ భూములకే పరిమితమైన ఆక్రమణలు, ఇప్పుడు హౌసింగ్ స్థలాలకూ విస్తరించాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత కొందరు నాయకుల పేర్లు చెప్పుకుంటూ ఈ కబ్జాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం స్థానికుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Tags: Freehold