పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి.
💠నీటి వనరులు, రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తతే రక్షణ: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లి ముచ్చట్లు:
వేసవి సెలవుల కాలక్షేపం చిన్నారుల పాలిట శాపంగా మారకూడదని, పబ్లిక్ ప్రదేశాలతో పాటు నీటి వనరుల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలు ఈత కోసం కాల్వలు, చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అలాగే రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల్లో అజాగ్రత్త వల్ల పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందని సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు.
నీటి వద్ద అజాగ్రత్త..ప్రాణాలకే ముప్పు!
జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కాల్వలు, కల్వర్టులు, లోతైన చెరువులు మరియు బావుల వద్ద చిన్నారులు ప్రమాదవశాత్తు జారి పడటం వల్ల ప్రతి ఏటా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. నీటి లోతు తెలియక, ఈత రాక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కలచివేస్తున్నాయని, సెలవుల్లో పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లనీయకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జనం మధ్య జాగ్రత్త.. క్షణకాలం ఏమరపాటు వద్దు!
సెలవుల నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు మరియు పుణ్యక్షేత్రాల్లో జన సమ్మర్దం అధికంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. అటువంటి చోట్ల తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలను గాలికొదిలేయవద్దని, రంగురంగుల వస్తువులకు ఆకర్షితులై పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తల్లిదండ్రులకు ఎస్పీ ముఖ్య సూచనలు:
నీటి వనరుల వద్ద: ఈత రాని పిల్లలను నీటి కుంటల దరిదాపులకు వెళ్లనీయకండి. ప్రమాదకరమైన లోతైన ప్రాంతాలను గుర్తించి పిల్లలకు వాటి గురించి అవగాహన కల్పించాలి.
గుర్తింపు కార్డులు: రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు పిల్లల జేబులో తల్లిదండ్రుల పేరు, ఫోన్ నంబర్ కలిగిన కార్డును ఉంచండి. పొరపాటున తప్పిపోయినా వెంటనే సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది.
అపరిచితుల పట్ల: గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, బొమ్మలను పిల్లలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అపరిచితులతో పిల్లలను పంపకూడదు.
ట్రాఫిక్ నిబంధనలు: రోడ్డు దాటేటప్పుడు లేదా వాహనాల రద్దీ ఉన్న చోట పిల్లల చేయి వదలకుండా పట్టుకోవాలి.
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు.
పిల్లలపై ఉన్న ప్రేమతో మైనర్లకు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు సంభవించి కుటుంబాల్లో తీరని లోకం మిగులుతుంది. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా వాహన యజమానులు లేదా తల్లిదండ్రుల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
అత్యవసర సహాయం: ఏదైనా ప్రమాదం జరిగినా లేదా పిల్లలు కనిపించకుండా పోయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100 / 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.
“పిల్లల ప్రాణాలు అత్యంత అమూల్యమైనవి. సెలవులను ఆనందంగా గడపడంతో పాటు వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల సహకారం ఉంటేనే ప్రమాదాలను నివారించగలం” అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Tags: Holiday ‘Fun’ — Don’t Let It Become a Life-Threatening Ordeal!