కన్నీటి వీడ్కోలు పలికిన పోలీసులు..
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల నిమిత్తం ఎస్పీ ఆదేశాల మేరకు 1 లక్ష రూపాయలు సాయం..
మదనపల్లి ముచ్చట్లు:
పీలేరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ 3175 గా పనిచేస్తున్న బి.వెంకటరమణ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం జిల్లా పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది. గురువారం ములకలచెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో జరిగిన అంతిమయాత్రలో పోలీసు అధికారులు, తోటి సిబ్బంది, బంధువులు , కుటుంబసభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
1993లో పోలీస్ శాఖలో చేరిన వెంకటరమణ, సుమారు 33 ఏళ్ల పాటు చిత్తూరు అన్నమయ్య ఉమ్మడి జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించారు. విధి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణగా ఉండే ఆయన, అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మరణించడం అందరినీ కలిచివేసింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు (కుమార్తె, ఇద్దరు కుమారులు) ఉన్నారు.
కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ
హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి పట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్ ను కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఏఆర్ఎస్ఐ జయచంద్ర, ములకలచెరువు ఏఎస్ఐ శ్యాంసుందర్ మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల నిమిత్తం ఎస్పీ ఆదేశాల మేరకు 1 లక్ష రూపాయల నగదును మృతుని సతీమణి భారతమ్మకు అందజేసి ఓదార్చారు.
గౌరవ వందనంతో వీడ్కోలు
చౌడ సముద్రం గ్రామంలో వెంకటరమణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. ఏఆర్ పోలీసుల ప్రత్యేక బృందం గాలిలోకి కాల్పులు జరిపి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కడసారి గౌరవం చాటారు.
Tags: Pileru Head Constable Venkataramana Dies Due to Illness