April 23, 2026
Explore
నిఘా నీడలో గాలివీడు మండలం..

నిఘా నీడలో గాలివీడు మండలం..

April 23, 2026 | Andhra Pradesh

💠గాలివీడులో సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

👉92 కెమెరాలతో నిరంతర నిఘా: సోలార్ సిస్టమ్‌తో పనిచేసే అత్యాధునిక సాంకేతికత..

👉ప్రజల భాగస్వామ్యంతోనే భద్రత సాధ్యం: జిల్లా ఎస్పీ..

మదనపల్లి ముచ్చట్లు:

నేర నియంత్రణలో సాంకేతికతను జోడించి, ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. గాలివీడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, ఆధునిక కాలంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ‘మూడో నేత్రం’ లా పనిచేస్తాయని పేర్కొన్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీలను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన ఈ నిఘా వ్యవస్థ, నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించడమే కాకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గాలివీడు మండల వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం మొత్తం 92 కెమెరాలను ఏర్పాటు చేశారు. గాలివీడు మండలం ఇప్పుడు పూర్తిస్థాయి పోలీసు నిఘా నీడలోకి వచ్చింది.

పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర నిఘా కోసం 24 కెమెరాలు. మండలంలోని 34 ప్రధాన పాయింట్లలో (34 x 2) మొత్తం 68 సోలార్ కెమెరాలను అమర్చారు. విద్యుత్ సరఫరా లేకపోయినా ఇవి నిరంతరాయంగా పనిచేయడం వీటి ప్రత్యేకత.

నిఘా నీడలో ప్రధాన ప్రాంతాలు:
నూలివీడు బస్ స్టాప్, కోటప్పకాలపల్లి క్రాస్, రెడ్డివారిపల్లి క్రాస్, ఎమ్మార్వో ఆఫీస్, గోరాన్ చెరువు సచివాలయం, ఎగువగొట్టివీడు బోర్డర్, వెలిగల్లు డ్యాం, గుర్రాల మిట్ట, ఆసర్ల గంగమ్మ టెంపుల్, ఎల్లంపల్లి బార్డర్, పావని సర్కిల్ మరియు గేట్ సర్కిల్ వంటి కీలక ప్రాంతాలలో ఈ సోలార్ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.

దాతల సహకారం అభినందనీయం: ఎస్పీ.. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతం కావడంలో గాలివీడు మండలంలోని వివిధ సంఘాలు, వ్యాపారస్తుల సహకారం మరువలేనిదని ఎస్పీ కొనియాడారు.

మెడికల్ అసోసియేషన్, గోల్డ్ షాప్ అసోసియేషన్. స్కూల్స్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్. ఎలక్ట్రికల్, సిమెంట్, చికెన్ షాప్ అసోసియేషన్స్. బైక్ షోరూమ్స్, బేకరీ షాప్స్, సూపర్ మార్కెట్స్ మరియు క్రాకర్ షాప్స్ ప్రతినిధులు. వీరందరి సామాజిక బాధ్యత ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సిఐ హెచ్. కృష్ణంరాజు నాయక్, గాలివీడు ఎస్ఐ జయ నరసింహారెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ జి. శోభ, రామాపురం ఎస్ఐ శివకుమార్, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు కెమెరాలు డొనేట్ చేసిన దాతలు పాల్గొన్నారు.

Tags:Galiveedu Mandal Under Surveillance