April 22, 2026
Explore
భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర

భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర

April 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

పిఏసి-1, ఆస్థాన మండపాల ఆధునీకరణ

శ్రీవారి సేవ వ్యవస్థ బలోపేతం

భక్తుల అభిప్రాయాలతో సేవల మెరుగుదల

శ్రీవారి దర్శనార్థం తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రతిరోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదని, వాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మాడవీధులు, ఆలయ పరిసరాలు మరియు ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు.
భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పారు. అన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.

తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులు, ముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలని, పెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఏసి-1, ఆస్థాన మండపాలను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.

శ్రీవారి సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఇతర ఆలయాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సిపిఆర్వో డా. టి.రవికి సూచించారు. భవిష్యత్తులో వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

ఈ సమావేశంలో టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణ, ఎస్వీబీసీ, స్విమ్స్, ఎఫ్ ఎం ఎస్, వసతి గృహాలు, ఎస్ ఎస్ డి, ఎస్ ఈ డీ, శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డా.ఎం.శరత్, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, సీఈ టి వి సత్యనారాయణ, అడిషనల్ ఎఫ్.ఏ.సి.ఏ.వో రవిప్రసాద్, ఇంఛార్జి లా ఆఫీసర్ వెంకట సుబ్బానాయుడు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:Improved Accommodation Facilities for Devotees: TTD EO M. Ravichandra